ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ విజయనగరం జిల్లా రాజకీయం తీవ్ర ఆసక్తికరంగా మారింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం కోసం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె, భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అయిన డాక్టర్ బొత్స అనూషను రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు రాజకీయంగా చెక్ పెట్టడమే లక్ష్యంగా బొత్స కుటుంబం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈసారి విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం బీసీ (మహిళ)కు రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మాజీ జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను సైతం టీడీపీ కూటమి తరఫున తన కుమార్తె సిరి సహస్రను బరిలోకి దించేందుకు సమాయత్తమవుతున్నారు. దీంతో విజయనగరం జెడ్పీ పోరు బొత్స కుటుంబ సభ్యుల మధ్యే హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పోరు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
