Breaking News

మెట్‌పల్లి మున్సిపల్ సమావేశంలో గందరగోళం.. అఖిలపక్ష కౌన్సిలర్ల వాకౌట్!

చైర్మన్ లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలపై నిరసన.. 22 మంది కౌన్సిలర్లు బయటకు.. సమావేశం రద్దు

జగిత్యాల, అక్టోబర్ 29 (E6 టీవీ న్యూస్).

కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం గందరగోళం మధ్య సాగింది. మున్సిపల్ చైర్మన్ లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లతో కూడిన అఖిలపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైర్మన్ వ్యవహారశైలిని నిరసిస్తూ మొత్తం 22 మంది కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. దీంతో సమావేశం రద్దయినట్లు వైస్ చైర్మన్ నవీన్ వెల్లడించారు.కౌన్సిలర్ల ప్రమేయం లేకుండానే వార్డుల్లో అభివృద్ధి పనులు, మున్సిపల్ ఎజెండా అంశాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. చైర్మన్‌కు అనుకూలమైన వార్డులకే అభివృద్ధి నిధులు కేటాయిస్తూ, మిగిలిన వార్డులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

జనరల్ ఫండ్ చెక్కుల విడుదలపై అభ్యంతరం

జనరల్ ఫండ్ చెక్కులను విడుదల చేయవద్దని నిర్ణయం తీసుకున్నప్పటికీ, కమిషనర్‌, చైర్మన్ చెక్కులను విడుదల చేశారని కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ వ్యవహారం కారణంగా మున్సిపల్ సిబ్బందికి జీతాల చెల్లింపులో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.చైర్మన్ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అఖిలపక్ష కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. 22 మంది కౌన్సిలర్లు వాకౌట్ చేయడంతో సమావేశం కొనసాగించే పరిస్థితి లేక రద్దయిందని వైస్ చైర్మన్ నవీన్ తెలిపారు.

మెట్‌పల్లి మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్ని వార్డులకు సమానంగా అభివృద్ధి నిధులు కేటాయించడం, కౌన్సిలర్ల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై వివాదం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *