ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంపద మళ్లీ రికార్డు స్థాయికి చేరింది. మూడు నెలల విరామం తర్వాత ఆయన ఆస్తి విలువ తిరిగి $1 ట్రిలియన్ మార్క్‌ను దాటి $1.04 ట్రిలియన్లకు చేరుకుంది. స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీల షేర్లు గణనీయంగా పుంజుకోవడంతో సోమవారం ఒక్కరోజే ఆయన నికర ఆస్తి విలువ $65 బిలియన్లు పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ ప్రస్తుత సంపద రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ ($371.5 బిలియన్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఈ నెలలో స్పేస్‌ఎక్స్ షేర్లు 13%, టెస్లా షేర్లు 6.7% లాభపడ్డాయి. మోర్గాన్ స్టాన్లీ సానుకూల నివేదిక, ‘స్టార్‌షిప్’ ఫ్లైట్ టెస్ట్ విజయం స్పేస్‌ఎక్స్‌కు బలాన్నివ్వగా, మూడో త్రైమాసికంలో ఊహించిన దానికంటే ఎక్కువ వాహనాల డెలివరీలు పూర్తి కావడం టెస్లా షేర్లను పరుగులు తీయించింది. జూన్‌లో $1.45 ట్రిలియన్లతో ప్రపంచపు తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన మస్క్, జులై చివరినాటికి షేర్ల పతనంతో దాదాపు $600 బిలియన్లకు పైగా నష్టపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ పుంజుకుని $1 ట్రిలియన్ క్లబ్‌లో చేరిన ఏకైక వ్యక్తిగా నిలిచారు.
