హైదరాబాద్‌లో తాగునీటి వృథాను అరికట్టేందుకు హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (HMWS&SB) చర్యలను వేగవంతం చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నంబర్ 57లో నివాస ప్రాంగణాన్ని శుభ్రపరచడానికి మంచినీటిని వాడుతున్నారని వాట్సాప్ ద్వారా అందిన ఫిర్యాదుపై జలమండలి అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. తాగునీటి దుర్వినియోగాన్ని నిర్ధారించిన అనంతరం సదరు యజమానికి ₹5,000 జరిమానా విధించారు. తాగునీటిని కేవలం మంచినీటి అవసరాలకు, గృహ అవసరాలకు మాత్రమే పొదుపుగా ఉపయోగించాలని, పరిసరాలు లేదా రోడ్లను కడిగేందుకు వాడితే కఠిన చర్యలు తప్పవని జలమండలి హెచ్చరించింది. నీటి వృథాను గమనిస్తే ఆధారాలతో వాట్సాప్ నంబర్ 99499 30003 లేదా కస్టమర్ కేర్ 155313కి ఫిర్యాదు చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.
తాగునీరు దుర్వినియోగం..జూబ్లీహిల్స్ నివాసికి రూ.5,000 జరిమానా
