హైదరాబాద్లోని వాలంతరి (WALAMTARI) వేదికగా ఏర్పాటు చేసిన మూసీ నది ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు హాజరుకాకుండా బీఆర్ఎస్ సీనియర్ నేతలను గృహనిర్బంధం చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలనను సాగిస్తూ, ప్రతిపక్షాల గొంతును అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.
కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడం చేతకాని ప్రభుత్వం, మూసీ ప్రక్షాళన పేరుతో రూ. 1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులు చేపట్టి కమిషన్ల కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేయాలనుకోవడం సిగ్గుచేటని, ఈ దోపిడీ యత్నాలను తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని హెచ్చరించారు. గృహనిర్బంధంలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
