అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఇందూరు, అక్టోబర్ 25 (E6tv న్యూస్).
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు సాగాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఇందూరులోని కిసాన్ ఫ్యాషన్ మాల్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించాలని సూచించారు. పేదలను ఆదుకొని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.యువత వారాంతాల్లో హంగు, ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో గుర్తింపు, గౌరవం లభించడంతో పాటు తోటి వారికి సహాయం చేశామనే ఆత్మసంతృప్తి కలుగుతుందని పేర్కొన్నారు.
సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ధన్‌పాల్ ప్రణయ్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


