తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురు నిందితుల పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు (ఇంపౌండ్) చేయాలని హైదరాబాద్ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి (RPO) కోర్టు అధికారికంగా లేఖ రాసింది. విచారణ కొనసాగుతున్న సమయంలో నిందితులు విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలన్న ఏసీబీ విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఐదో నిందితుడైన అల్బెర్టో లోంగో విదేశీయుడు కావడంతో ఆయన పాస్‌పోర్టుపై ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయని సమాచారం.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులను మళ్లించారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు 2024 డిసెంబర్‌లో కేసు నమోదు చేసి, ఇప్పటికే విచారణ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానంలో విచారణ దశలో ఉండగా, ఏసీబీ కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
