హైదరాబాద్ శివార్లలోని మణికొండ నెక్నాంపూర్లో దొంగల ముఠా విరుచుకుపడి తీరని తీవ్ర ఆందోళన రేకెత్తించింది. గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ ఫెన్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల కాపలా ఉన్నప్పటికీ.. స్థానిక ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:20 గంటల సమయంలో ఆరుగురు అనుమానితులు చొరబడ్డారు. ప్రధాన ద్వారం గుండా వస్తే సెక్యూరిటీకి దొరికిపోతామని భావించిన దుండగులు లేక్‌సైడ్ ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్మెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి C-బ్లాక్ మెట్ల మార్గం ద్వారా ఒక ఫ్లాట్‌లోకి చొరబడి విలువైన వస్తువులు, నగదును దొంగిలించారు.
ఈ దొంగతనం సమయంలో అపార్ట్మెంట్లో వారి కదలికలను గమనించి అడ్డుకునేందుకు లేదా ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను దొంగలు ఆయుధాలతో బెదిరించి, దాడి చేసినట్లు సమాచారం. ఆరుగురు ముఠా సభ్యుల దృశ్యాలు అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్‌లో నిందితుల ముఖాలు, దుస్తులు, వచ్చిన మార్గాలను విశ్లేషిస్తూనే పాత నేరస్తుల రికార్డులతో పోల్చి చూస్తున్నారు.
స్థానికంగా ఈ ఘటనను చెడ్డీ గ్యాంగ్ పనేనని చర్చించుకుంటున్నప్పటికీ, పోలీసుల అధికారిక విచారణ పూర్తయితే తప్ప నిందితుల గుర్తింపుపై స్పష్టత రాదు. ఈ భయాందోళనల నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలలో భద్రతా ప్రమాణాలను పునఃసమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల మధ్య వెనుక వైపు, ఫెన్సింగ్ పరిసరాల్లో సెక్యూరిటీ గస్తీ పెంచడం, సీసీ కెమెరాల్లో బ్లైండ్ స్పాట్స్ లేకుండా నిరంతరం తనిఖీలు చేయడం అత్యవసరమని అధికారులు, భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
