వైద్య ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నం.150 తెలంగాణ విద్యార్థులకే నష్టదాయకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా నాలుగేళ్ల చదువు ఆధారంగా స్థానికత కేటాయించే ఈ నిబంధన వల్ల, ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదివిన జల్ల అంకిత అనే విద్యార్థిని ఇంటర్ ఏపీలో పూర్తి చేయడంతో ‘నాన్-లోకల్’గా మిగిలిపోయింది. ఈ విషయమై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో 150 ప్రకారం వరుస నాలుగేళ్ల చదువు లేనందున మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది.
అయితే, జీవో 150లోని లొసుగుల ఆధారంగా పక్క రాష్ట్రాల విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల ద్వారా తెలంగాణలో రికార్డులు సృష్టించి 85% స్థానిక కోటా సీట్లను దక్కించుకుంటున్నారని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఈ జీవోను సవరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రాల మాదిరిగా కనీసం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు (7 సంవత్సరాలు) తెలంగాణలోనే చదివి ఉండాలనే నిబంధనతో పాటు తల్లిదండ్రుల శాశ్వత నివాస ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ కొత్త జీవో తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
