Breaking News

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: మంత్రులు, అధికారులతో దానం వరుస భేటీలు

అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కావడం, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు తెచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తమ పట్ల చులకనగా వ్యవహరించారని భావించిన పలువురు మంత్రులు, అధికారులు ఇప్పుడు ఆయన మారుతున్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో తన కంటే జూనియర్లు అనే ఫీలింగ్‌తో మంత్రులను నిర్లక్ష్యం చేశారని, అధికారులతోనూ కఠినంగా వ్యవహరించేవారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉప ఎన్నిక ముంగిట నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయించుకునేందుకు ఆ మంత్రులు, అధికారుల చుట్టూ దానం ప్రదక్షిణలు చేస్తూ గౌరవంగా పలకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి తానే కీలకమని గతంలో వ్యాఖ్యానించిన దానం, ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత కీలకంగా మారడంతో, పరిస్థితులకు అనుగుణంగా దానం నాగేందర్ తన రూటు మార్చుకుని అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *