ఇందూరు, అక్టోబర్ 25 (E6TV న్యూస్).
సామాన్యుల విజయగాథలను దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేసే జాతీయ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్‌ను ఆయన స్థానిక నాయకులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ ప్రజల కృషి, సేవా స్ఫూర్తి, ఆవిష్కరణలు, స్వదేశీ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత అని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ‘మన్ కీ బాత్’ ప్రజలకు, ప్రధానమంత్రికి మధ్య ఆత్మీయ వారధిగా నిలుస్తోందన్నారు.
పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహిస్తున్న ‘నవ్-త్రింజన్’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించడం విశేషమని తెలిపారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల పునరుద్ధరణ, చేనేత నైపుణ్యాలను భావితరాలకు అందించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని వివరించారు.ఉత్తరాఖండ్‌లో హేవల్ నదిని పునరుజ్జీవింపజేసేందుకు స్థానిక ప్రజలు, అధికారులు కలిసి చేపడుతున్న వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, మొక్కల పెంపకం కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్య ప్రాధాన్యతను చాటుతున్నాయని పేర్కొన్నారు.
రాబోయే దీపావళి పండుగ సందర్భంగా స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న ప్రధాని పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే సూచించారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించడం ద్వారా స్థానిక కళాకారులు, చిన్న వ్యాపారులకు అండగా నిలవవచ్చన్నారు.
‘మన్ కీ బాత్’ కేవలం రేడియో కార్యక్రమం మాత్రమే కాదని, మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి, సమాజ సేవలో నిమగ్నమైన వ్యక్తులను కోట్లాది మందికి పరిచయం చేసే గొప్ప వేదిక అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్, నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

