వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఘటనపై విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి
ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్).
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యగడి తండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోత్ రమేష్ (సోనా) భార్య కవిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కవిత రెండు రోజుల క్రితం రాజంపేటలోని ఎల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే, ఆపరేషన్ అనంతరం సరైన వైద్యం అందలేదని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని భర్త రమేష్తో పాటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంగళవారం రాత్రి కవిత మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.కవిత మృతితో సోమిర్యగడి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో సంబంధిత వైద్యాధికారులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి, మృతికి గల అసలు కారణాలను వెలికితీయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం జరిగిందా? లేదా? అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
