నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన పోలాస సుధాకర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) తన దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని పదే పదే జరిమానాలు విధిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశారని, అందుకే విసిగిపోయి సుధాకర్ ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. 90 శాతం కాలిన గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి గృహనిర్భంధంలో ఉంచారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా భద్రతను పెంచారు.
భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఘటన: సుధాకర్ మృతి
