హైదరాబాద్ వాలంతరి (WALAMTARI) వేదికగా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నిర్వాసితుల ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు ఆమె కుమారుడిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా ఆంక్షలు విధిస్తోందని, సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల వద్దకు వెళ్తే అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకుందని సబిత తీవ్రంగా మండిపడ్డారు.
రైతులు తీవ్ర కరువు, విద్యుత్ కోతలు, పంట నష్టాలతో అల్లాడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. రూ. 1.40 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్ట్ను ఎందుకు హడావుడిగా చేపడుతోందని ఆమె ప్రశ్నించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వం బాధ్యత వహించదని స్వయం ప్రకటిత అంగీకార పత్రాలపై సంతకాలు చేయించుకోవడం దారుణమన్నారు. కేసీఆర్ హయాంలో నిరంతర ఉచిత విద్యుత్, సాగునీటితో తెలంగాణ దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా నిలిచిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పక్కనబెట్టి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. రైతులను కూలీలుగా మార్చేలా ఉపాధి హామీ పథకంలో చేరాలని సీఎం వ్యాఖ్యానించడం సిగ్గుచేటని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
