అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల రద్దుపై కొరడా ఝుళిపిస్తోంది. 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. నేర కార్యకలాపాలకు పాల్పడటం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, మోసపూరిత చర్యల ద్వారా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రద్దు చేసిన వీసాలలో సుమారు 4,000 వీసాలు ‘బెర్త్ టూరిజం’కు సంబంధించినవి కావడం గమనార్హం. కేవలం అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా ఆ శిశువుకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం సంపాదించే లక్ష్యంతో ప్రయాణించడాన్ని బెర్త్ టూరిజంగా పరిగణిస్తారు. ఇలాంటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.
గత ప్రభుత్వాలతో పోలిస్తే ట్రంప్ పరిపాలనలో వీసాల రద్దు ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే, మోసాలకు పాల్పడే, లేదా దేశ భద్రతకు భంగం కలిగించే వీసాదారుల పట్ల తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. 2026లో ఈ రద్దు ప్రక్రియ మరింత వేగవంతం కాగా, రద్దయిన వారి జాతీయత వివరాలను అధికారులు వెల్లడించలేదు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలపై, ముఖ్యంగా సరైన నిబంధనలు పాటించకుండా వీసాలు రద్దు చేస్తుండటంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
