రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం – అమరవేణి నర్సాగౌడ్
ఆర్మూర్, అక్టోబర్ 23 (E6tv న్యూస్).
VDC గ్రామ అభివృద్ధి కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో గీత కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని పల్లె గ్రామపంచాయతీ పరిధిలో గల రామాలయ ఫంక్షన్ హాల్‌లో మోకుదెబ్బ నిజామాబాద్ జిల్లా రెండో మహాసభలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు అమరవేణి నర్సాగౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపతి లింగాగౌడ్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలల్ సాయిబాబాగౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో VDC కమిటీల పేరుతో చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ, తమ మాట వినని వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాళ్లరాంపూర్‌లో గౌడ సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు దళితులు, ఇతర బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడులను, ఘటనపై వార్తా సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు, ఎక్సైజ్ అధికారులపై దాడులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను నాయకులు తీవ్రంగా ఖండించారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ, ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు.బీసీ కమిషన్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని నాయకులు ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి VDC కమిటీలపై సమగ్ర పరిశీలన జరిపి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.లేనిపక్షంలో తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ, మోకుదెబ్బ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమాన్ని చేపడతామని అమరవేణి నర్సాగౌడ్ హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం మోకుదెబ్బ నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులతో పాటు తెలంగాణ గౌడ మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ గ్రామాలకు చెందిన గౌడ సామాజిక వర్గీయులు, గీత కార్మికులు పాల్గొన్నారు.

