Breaking News

“జగిత్యాల ఎమ్మెల్యే ఒక ఐరన్ లెగ్ శాస్త్రి!”జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళుతుండటంపై ధర్మపురి అర్వింద్ స్పందన

జగిత్యాల/మెట్‌పల్లి (E6TV ప్రతినిధి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తనదైన శైలిలో స్పందించారు. మెట్‌పల్లిలో బీఎస్పీ నేత నిశాంత్ కార్తికేయను బీజేపీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీవన్ రెడ్డిపై గౌరవం ఉంది.. కానీ ఆ నిర్ణయం తప్పే!

“వ్యక్తిగతంగా జీవన్ రెడ్డి గారు నాకు తండ్రి లాంటి వారు, ఆయనపై నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ముమ్మాటికీ తప్పుడు నిర్ణయమే” అని అర్వింద్ వ్యాఖ్యానించారు. అస్తిత్వం కోల్పోయి, మనుగడ కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని, కేవలం తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఆయనను బీజేపీలోకి ఆహ్వానించామని, కానీ అక్కడ నుంచి సానుకూల స్పందన రాలేదని అర్వింద్ గుర్తు చేశారు.

జగిత్యాల ఎమ్మెల్యేపై ‘ఐరన్ లెగ్’ విమర్శలు

ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై అర్వింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

  • “సంజయ్ కుమార్ ఒక ‘ఐరన్ లెగ్ శాస్త్రి’. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే.”
  • గతంలో బోగ శ్రావణిని ఇబ్బంది పెట్టి పార్టీ నుంచి వెళ్లగొట్టారని, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లి సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇంట్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు.
  • కేవలం తన సొంత ప్రయోజనాల కోసం, తన వియ్యంకుడి బిల్లుల కోసమే సంజయ్ పార్టీలు మారుతుంటారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై విమర్శల బాణం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అర్వింద్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి విధివిధానాలు లేవని, ఆ పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని స్పష్టం చేశారు. ఒకవైపు జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నా, అదంతా ఒక వ్యర్థ ప్రయత్నం మాత్రమేనని బీజేపీ తేల్చి చెబుతోంది.

తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, ప్రజలు త్వరలోనే ఈ మార్పును చూస్తారని ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *