అమరావతి: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మాయలో పడి చిన్న వయసులోనే పిల్లలు పెడదారి పడుతున్నారనే ఆందోళనల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది.
నారా లోకేశ్ కీలక భేటీ
ఉండవల్లిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. మెటా (Facebook/Instagram), యూట్యూబ్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లతో కలిసి లోకేశ్ సుదీర్ఘంగా చర్చించారు.

ముసాయిదా చట్టం సిద్ధం!
పిల్లల సృజనాత్మకత దెబ్బతినకుండా ఉండేందుకు 13 ఏళ్ల లోపు వారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
- 13 – 16 ఏళ్ల వయసు: ఈ వయసు పిల్లలకు కేవలం వారి స్థాయికి తగిన (Age-appropriate) కంటెంట్ మాత్రమే కనిపించేలా విధివిధానాలు ఉండాలని సూచించారు.
- ఏజ్ టోకెన్ సిస్టమ్: వయసు నిర్ధారణ కోసం ‘డిజిలాకర్’తో అనుసంధానించిన ‘ఏజ్ టోకెన్’ విధానాన్ని పరిశీలించాలని కోరారు.
టార్గెట్: ఆస్ట్రేలియా, సింగపూర్ మోడల్
పిల్లల డిజిటల్ భద్రత విషయంలో అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని ఐటీ మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, విద్వేషపూరిత పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
తల్లిదండ్రులకు అవగాహన
కేవలం చట్టం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ రోజున విద్యార్థులకు, పేరెంట్స్ మీటింగ్స్‌లో తల్లిదండ్రులకు సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి వివరించనున్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు సైతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి పిల్లల భవిష్యత్తు కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

