వర్షం ఎప్పుడూ రాని గ్రామం – భూమిపై ఇంకా ఛేదించని రహస్యం!
సనాః (యెమెన్) – ఈ భూమిపై ఇంకా అనేక రహస్యాలు మనిషిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అలాంటి అద్భుతమైన, నమ్మశక్యం కాని ఒక విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వర్షం ఎప్పుడూ చూడని ఒక గ్రామం ఉందని మీరు వింటే ఆశ్చర్యపోతారు కదా? కానీ ఇది నిజం!
యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న హర్జా ప్రాంతం, మనఖ్ డైరెక్టరేట్ సమీపంలోని అల్-హుతైబ్ గ్రామం ఈ అద్భుతానికి నిలయం. ఈ గ్రామం పర్వత శిఖరంపై, సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ అందమైన ఇళ్ళు, సహజసిద్ధమైన సుందర దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
అయితే, ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే – ఇక్కడ ఒక్క చుక్క వర్షం కూడా ఎప్పుడూ పడలేదు!
ఇది ఎడారి మధ్యలో కాదు. ఆకుపచ్చ కొండల మధ్య ఉన్న ఈ ఊరు “వర్షం లేని గ్రామం”గా గుర్తింపు పొందింది. శీతాకాలంలో చల్లగా, ఉదయాన్నే మబ్బుగా ఉంటుంది. కానీ సూర్యుడు ఉదయించగానే వేడి తీవ్రంగా పెరుగుతుంది.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ గ్రామం ఎత్తు కారణంగానే ఇక్కడ వర్షం పడదు. గ్రామం కింద మేఘాలు ఏర్పడి, అవి దిగువ ప్రాంతాల్లో వర్షం కురిపిస్తాయి. కానీ గ్రామం మాత్రం మేఘాల “పైన” ఉండటంతో వర్షం ఒక్క చుక్క కూడా చేరదు.
ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు అల్-బోహ్రా లేదా అల్-ముకర్రమా సముదాయంకు చెందినవారు. వీరు ముహమ్మద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలోని ఇస్మాయిలీ మత శాఖను అనుసరిస్తారు.
ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలిచిన ఈ గ్రామం, ప్రకృతి రహస్యాలకు మరో ఉదాహరణగా నిలుస్తోంది.
వర్షం ఎప్పుడూ రాని ఊరు – అల్ హుతైబ్… నిజంగా భూమిపై ఒక మిస్టరీ!

