అమరావతి:
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత, అధికారులు సురేష్, ఏకే రవికృష్ణ సీఎంను కలసి ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించారు.

నివేదిక వివరాలు:
ఒకే షెడ్డులో, ఒకే సమయంలో 14 మంది కార్మికులు బాణసంచా తయారీ పనులు చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు వివరించారు. హార్డ్ మెటీరియల్ వాడటంతో స్పార్క్ ఏర్పడి, అది మాన్యుఫాక్చరింగ్ ప్రాంతంలో పడటమే పేలుడుకు కారణమని చెప్పారు. సేఫ్టీ నిబంధనలు పాటించలేదని నివేదికలో స్పష్టమైంది.
సీఎం ఆదేశాలు:
- పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.
- లైసెన్సులు ఇచ్చే ముందు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారా లేదా అనే అంశంపై నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు.
- బాణసంచా తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
- ఇకపై ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ కొనుగోళ్లు ఆన్లైన్ ద్వారానే జరిగేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు.
- తయారీ, కొనుగోలు ప్రక్రియపై కఠిన పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.
- నిబంధనలకు విరుద్ధంగా ఉన్న తయారీ కేంద్రాలకు ఏ పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని, ఉల్లంఘన చేసినవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
- అన్ని కేంద్రాలు సేఫ్టీ నిబంధనల ప్రకారం ఉండాలని, అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడికి వ్యక్తిగత భీమా తప్పనిసరిగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

