తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తానని చెప్పి భక్తులను నమ్మించి కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టిన ఓ కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన బురిగాల అశోక్ కుమార్‌రెడ్డి ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే… అశోక్ కుమార్ రెడ్డి “రాక్‌స్టార్ ఈవెంట్స్” పేరుతో ఓ నకిలీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను సృష్టించాడు.
తనకు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి, శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, సుప్రభాత సేవ టికెట్లు, గదులు ఇప్పిస్తానని భక్తులను నమ్మించేవాడు.
అతని మాటలు నమ్మిన భక్తులు ఆశతో ముందుగానే లక్షల్లో డబ్బులు చెల్లించేవారు.
తీరా దర్శనం కోసం తిరుమలకు రాగానే అశోక్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అదృశ్యమయ్యేవాడు.
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన భక్తులు కూడా ఈ కేటుగాడి బారిన పడ్డారు.
వారిని కూడా ఇదే రీతిలో మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు.
తర్వాత అశోక్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో వారు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా తిరుమల టూ టౌన్ పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో విస్మయానికి గురిచేసే వివరాలు బయటపడ్డాయి.
అశోక్ బ్యాంకు ఖాతాలో కేవలం ఏడాది కాలంలోనే కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
అతను అమన్ గోయల్ నుండి రూ.4,16,500, అలాగే గౌతమ్ గుప్తా, రాధిక అగర్వాల్ వంటి అనేక మందిని మోసం చేసినట్లు తేలింది.

