“కొరియన్ డ్రామాలో నటిస్తా… కానీ ఒక కండిషన్!” – రష్మిక మందన్న

‘నేషనల్ క్రష్’గా పేరు గాంచిన రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో బిజీగా ఉన్నారు. విభిన్నమైన పాత్రలు, చురుకైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఈ అందాల భామ తాజాగా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

తనకు కొరియన్ డ్రామాలు అంటే (కే-డ్రామాలు) ఎంతో ఇష్టమని రష్మిక ముందే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఒక జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కే-డ్రామాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, కానీ ఒక కండిషన్ ఉంటుందని తెలిపారు.

“కే-డ్రామాలో నటించే అవకాశం వస్తే అది నాకు చాలా సరదాగా ఉంటుంది. కానీ వాళ్లు ఎలాంటి కథతో వస్తారన్నదే ముఖ్యం. ఎందుకంటే తెరపై కనిపించే పాత్రల విషయంలో నేను చాలా పికీగా ఉంటాను. నాకు పాత్ర నచ్చితేనే ఆ ప్రాజెక్ట్ చేస్తాను,” అని రష్మిక స్పష్టం చేశారు.

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలోనే కే-డ్రామాలపై తన ఆసక్తి మొదలైందని, ఒక్కో సిరీస్‌లో 16 ఎపిసోడ్లు ఉండటం వల్ల వాటిని చూసేందుకు సమయం దొరికిందని ఆమె గుర్తుచేసుకున్నారు. రష్మిక మాట్లాడుతూ, “కథలు, పాత్రలు, ఎమోషన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి కాబట్టి నేను వాటి ఫ్యాన్‌య్యాను,” అని తెలిపారు.

ఇక సినిమాల విషయానికొస్తే, రష్మిక ఇటీవల విడుదలైన ‘తమ్మా’ అనే హారర్-కామెడీ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించారు. ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, ‘భేడియా’, ‘స్త్రీ’, ‘ముంజ్యా’ వంటి హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. ఇందులో రష్మిక వాంపైర్ పాత్రలో కొత్తగా కనిపించారు.

అదే విధంగా ఆమె తాజా తెలుగు చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న పలు భాషల్లో విడుదలై మంచి స్పందన అందుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ప్రస్తుతం రష్మిక ‘కాక్‌టెయిల్ 2’, ‘మైసా’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

కొరియన్ డ్రామాలపై ఇంత ఆసక్తి చూపిస్తున్న రష్మిక త్వరలో నిజంగానే ఒక కే-డ్రామాలో కనిపిస్తే ఆశ్చర్యమే కాదు. అభిమానులు కూడా ఆమెను కొత్త భాషలో, కొత్త అవతారంలో చూడాలని ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *