ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన భారీ పేలుడు ఘటనలో కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో అత్యంత అసమర్థ హోం శాఖ మంత్రిగా అమిత్ షాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అభివర్ణించారు. దేశంలో గత కొన్నేళ్లుగా జరిగిన భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహించి అమిత్ షా రాజీనామా చేయాలన్నారు. మరే ఇతర రాష్ట్రంలోనైనా లేదా దేశంలోనైనా ఇన్ని వైఫల్యాలు జరిగితే హోం మంత్రిని కేబినెట్ నుంచి తొలగించేవారని.. కానీ ప్రధాని మోదీ రహస్యాలన్నీ అమిత్ షాకు తెలుసు కాబట్టే ఆయనను తొలగించడం లేదని ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణ చేశారు.

జాతీయ భద్రతా వైఫల్యాలకు అమిత్ షాను తక్షణమే బాధ్యుడిని చేయాలని.. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రియాంక్ ఖర్గే డిమాండ్ చేశారు. పుల్వామా, మణిపూర్, ఇతర రాష్ట్రాల్లోని చట్ట ఉల్లంఘనలను ఉదహరించిన ప్రియాంక్ ఖర్గే.. సరిహద్దులను, దేశ అంతర్గత భద్రతను కాపాడాల్సిన బాధ్యత హోం శాఖ మంత్రిదేనని ఖర్గే నిలదీశారు. అధిక సంఖ్యలో భద్రతా వైఫల్యాలు జరిగినప్పటికీ అమిత్ షా బాధ్యత వహించకుండా పదవిలో కొనసాగడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రియాంక్ ఖర్గే చేసిన ఆరోపణలు, చేస్తున్న డిమాండ్‌కు కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ కూడా మద్దతు పలికారు. ఢిల్లీ పేలుడును హేయమైన చర్యగా అభివర్ణించిన పాటిల్.. ఇది స్పష్టమైన భద్రతా వైఫల్యమని పేర్కొన్నారు.
గతంలో బెంగళూరులో రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగినప్పుడు.. బీజేపీ నాయకులు రాజీనామాలను కోరారని గుర్తు చేశారు.ఇపుడు.. వారు కూడా బాధ్యత వహించాలని.. హోం మంత్రి రాజీనామా చేయాలని పాటిల్ డిమాండ్ చేశారు. ఇది ఉగ్రదాడి అయినా లేదా రసాయన పేలుడు అయినా.. హై సెక్యూరిటీ జోన్ దగ్గర ఈ ఘటన జరగడం అనేది భద్రతలో పెద్ద లోపాన్ని సూచిస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి బాధిత కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే అత్యంత ముఖ్యమని ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్ పేర్కొన్నారు.

