జాఫర్ గడ్‌లో మా ఇల్లు అనాధాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

జనగామ జిల్లా జాఫర్ గడ్ లో మా ఇల్లు అనాధాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలంలో ఉన్న మా ఇల్లు అనాధాశ్రమాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులతో ఆత్మీయంగా మమేకమై వారి ఆరోగ్యం, చదువు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కాసేపు గడిపి, వారి కష్టసుఖాలను ఓర్పుగా విని ధైర్యం చెప్పారు.

మా ఇల్లు అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్య ప్రస్తుతం NIA చేత అరెస్టు కావడం పట్ల మంత్రి సీతక్క స్పందించారు. ఈ సందర్భంగా గాదె ఇన్నయ్య సతీమణిని ఓదార్చి, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ అనాధాశ్రమాన్ని నడిపిస్తున్న కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు.

ఆశ్రమంలో ఉన్న విద్యార్థులు గాదె ఇన్నయ్యను మిస్ అవుతున్నామని మంత్రికి చెప్పారు. దీనికి స్పందించిన మంత్రి సీతక్క, “మీరు నిరాశ చెందవద్దు. ధైర్యంగా ఉండాలి, క్రమశిక్షణతో మెలగాలి. చదువే మీ భవిష్యత్తు” అంటూ పిల్లలకు హితవు పలికారు. తాను అడపాదడపా ఆశ్రమాన్ని సందర్శిస్తూ, పిల్లలకు అవసరమైన సహాయం అందిస్తానని తెలిపారు.

విద్యార్థులు బాగా చదువుకోవాలని, వారికి అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం ద్వారా కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం చిన్నారులతో కలిసి ఫోటోలు దిగుతూ వారికి మరింత ఉత్సాహం నింపారు.

ఈ కార్యక్రమంతో ఆశ్రమంలోని పిల్లల్లో కొత్త ఆశలు చిగురించాయని స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *