డీకే త్యాగం వెనుక సీక్రెట్ ప్లాన్ బయటకు!

సీఎం పదవి అంశంపై కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లిన వేళ అక్కడి రాజకీయాలు వేడేక్కాయి. సీఎం మార్పు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ తర్వాత ఏమైంది..? అధిష్టానం ఈ అంశంపై ఎలా రియాక్ట్ అయ్యింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. 2023 ఎన్నికల ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు ముగియడంతో సీఎం పీఠం మారుతుందని, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా డీకే పెద్ద మనసు చేసుకుని సీఎం పదవిని త్యాగం చేశారు. సీఎం మార్పుపై చర్చ తీవ్రమైన వేళ ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, మరో రెండేళ్లు తానే బడ్జెట్‌ ప్రవేశపెడతానని సీఎం సిద్దరామయ్య చెప్పారు.ఈ ప్రకటన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆప్తులలో ఆగ్రహం పెల్లుబికేలా చేసింది. ఈ పరిణామాల క్రమంలో ఆయనకు సన్నిహితులైన ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిశారు. మంత్రి చలువరాయస్వామితోపాటు మరింతమంది ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలోనే చక్కెర శాఖ మంత్రి శివానందపాటిల్‌ ఢిల్లీ వెళ్లడం సరికొత్త చర్చలకు దారితీసింది. ఢిల్లీ వెళ్లిన మంత్రులతోపాటు ఎమ్మెల్యేలకు సిద్దరామయ్య నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది.

మైసూరులో సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. నాయకత్వ మార్పు లేదా కేబినెట్‌ విస్తరణపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని అన్నారు. ఖర్గే శనివారం బెంగళూరుకు వస్తున్నారని, తాను స్వయంగా వెళ్లి కలుస్తానని అన్నారు. సిద్దరామయ్యకు ఆప్తులుగా పేరొందిన ముఖ్యులు డిన్నర్‌ మీటింగ్‌ నిర్వహించడం సరికొత్త చర్చకు దారితీసింది. చివరకు ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. ఐదేళ్ల పాటు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయనకు తాము పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. గ్రూపు రాజకీయాలు చేయడం తన రక్తంలోనే లేదని ఆయన అన్నారు. ఎవరో కొంతమంది మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు కూడా తనవారే అని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సిద్ధరామయ్య చెప్పారని, ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలిశారని ఆయన అన్నారు.

వారు మంత్రి పదవుల కోసమే కలిసి ఉంటారని, అది సహజమేనని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మంత్రి పదవి కోసం వారు ముఖ్యమంత్రిని కూడా కలిశారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తమంతట తామే వెళ్లారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులేనని, వారికి ఏ బాధ్యత అయినా అప్పగించవచ్చని శివకుమార్ అన్నారు. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారని, ఆయనకు తాను శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. మేమంతా కలిసి పనిచేస్తామని అన్నారు. సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్, శుక్రవారం ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. మిగిలిన రెండున్నరేళ్లు కూడా సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. దీంతో సీఎం మార్పు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *