దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం: కురసాల కన్నబాబు ఆరోపణలు


అమరావతి:
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అడ్డగోలు ఎదురుదాడులకు దిగుతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఊరూరా, వాడవాడలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం ఊపిరి సలపనట్టుగా మారిందని ఆయన అన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి చంద్రబాబు ప్రభుత్వాన్ని కలవరపెడుతోందని, దీనికి నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలేనని కన్నబాబు పేర్కొన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగడం కూడా చంద్రబాబుకు కంటగింపుగా మారిందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ద్వంద్వ ప్రమాణాలపై కూడా ఆయన ప్రశ్నించారు. “బాలకృష్ణ, చంద్రబాబు ఫ్లెక్సీల ముందు పొట్టేళ్ల బలి ఇస్తే అది తప్పు కాదంటారు. కానీ జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పొట్టేళ్లను కోస్తే తప్పు అవుతుందా?” అని ప్రశ్నిస్తూ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని, ఇటువంటి వైఖరి ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని కురసాల కన్నబాబు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *