బండి సంజయ్ అవుట్… కిషన్ రెడ్డి ఇన్! జూబ్లిహిల్స్‌లో బీజేపీ కొత్త వ్యూహం

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. పార్టీ తరపున మొదట లీడ్ తీసుకున్న బండి సంజయ్ హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. బండి సంజయ్ మాత్రం ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు.

మొదట్లో మజ్లిస్, కాంగ్రెస్‌లపై తనదైన ధాటితో బండి సంజయ్ దాడి చేయడంతో బీజేపీకి ఊపొచ్చిందని అనిపించింది. కానీ అదే ధోరణి బీజేపీ హైకమాండ్‌కు నచ్చలేదని సమాచారం. ఆయన దూకుడు తగ్గించాలని, ప్రచారం నుంచి దూరంగా ఉండాలని సూచనలిచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ముస్లిం ఓట్లు కీలకమైన జూబ్లిహిల్స్‌లో బండి సంజయ్ మజ్లిస్‌పై దూసుకెళ్లడం బీజేపీకి రెండు వైపులా కత్తిలా మారింది. ఒక వర్గం ఆయనకు మద్దతు ఇచ్చినా, మరో వర్గం దూరమవుతుందనే భయం హైకమాండ్‌లో కనిపిస్తోంది. అందుకే ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కిషన్ రెడ్డి ప్రస్తుతం రోజంతా ప్రచారం చేస్తున్నా, ఆయన శైలి పూర్తిగా విభిన్నంగా ఉంది. బండి సంజయ్ తరహా దూకుడు, హీట్ స్పీచ్‌లు ఆయనలో లేవు. ప్రచారం నిశ్శబ్దంగా జరుగుతుండటంతో, బీజేపీ వేడి తగ్గిందనే అభిప్రాయం బలపడుతోంది.

అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాంటి పరిస్థితే. అప్పుడు బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కిషన్ రెడ్డిని నియమించారు. అదే విధంగా ఇప్పుడు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లోనూ అదే ఫార్ములా అమలవుతోంది.

బీజేపీ హైకమాండ్‌ ఈ నిర్ణయానికి కారణం రెండు ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు —

  1. బండి సంజయ్ తరహా దూకుడు ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదని భావించడం.
  2. లేదా బీఆర్‌ఎస్‌తో ఉన్న లోపాయికారీ అర్ధం ప్రకారం బీజేపీని సైలెంట్ మోడ్‌లో ఉంచాలని నిర్ణయం తీసుకోవడం.

ఏదేమైనా, బండి సంజయ్‌ను పక్కన పెట్టడం వల్ల బీజేపీ ఇమేజ్, ఉత్సాహం రెండూ దెబ్బతిన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన లేని ప్రచారం నిరుత్సాహకరంగా మారిందని, ఆయన కృషి బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని నేతల మధ్య చర్చ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *