గీత దాటితే కటకటాలే

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అనిత హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని, అది లేకనే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.
కూటమి ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ చక్కగా పనిచేయడం వల్లే క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. అందుకే దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో మహిళలు బయటకు రావడానికి కూడా భయపడేవాళ్లు అని, చట్టబద్ధత లేని దిశా యాప్ పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉందన్నారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ తో మహిళా రక్షణకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని స్పష్టం చేసారు.తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, గీత దాటితే కటకటాలే అని హెచ్చరించారు.సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు వివిధ కార్యక్రమాలు ద్వారా అవగాహన కల్పిస్తున్నాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *