రాష్ట్రానికి కనీసం రూ.30 వేల కోట్ల నష్టం

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంటును మళ్లీ మంజూరు చేస్తుందని ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఇక్కడి పరిస్థితులను స్పష్టంగా వివరించింది. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏ స్థాయిలో పడిపోయిందో, పదేళ్ల తర్వాత కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో విశ్లేషించి చెప్పింది. అయినా, 16వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు గ్రాంట్‌ ఇచ్చేందుకు సిఫార్సు చేయలేదు. కనీసం తొలి మూడు ఆర్థిక సంవత్సరాలైనా రెవెన్యూ లోటు గ్రాంట్‌ మంజూరు చేయాలని ఏపీ విన్నవించినప్పటికీ, తోసిపుచ్చింది.

2014-15లో కాగ్‌ పేర్కొన్న రెవెన్యూ లోటు ప్రకారం, ఆ తర్వాత రెండు ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు మొత్తం 11 ఏళ్ల పాటు కేంద్రం సుమారు రూ.67 వేల కోట్ల మేర రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద ఏపీకి ఇచ్చింది. సగటున ఏడాదికి రూ.6,000 కోట్ల చొప్పున లెక్కించినా.. ప్రస్తుత ఆర్థిక సంఘం కాలానికి ఐదేళ్లలో రూ.30 వేల కోట్ల వరకు రాష్ట్రం నష్టపోతోంది.

రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు ఆ మొత్తాన్ని భర్తీ చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది.
అంతంతమాత్రంగా సేవా రంగం

విభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంది.

2013-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 24%, పరిశ్రమల వాటా 25%, సేవారంగం వాటా 51%గా ఉండేది.

విభజన తర్వాత 2014-15లో ఏపీలో వ్యవసాయ రంగం వాటా 31% కాగా, తెలంగాణలో 16%గా ఉంది. పరిశ్రమల వాటా ఏపీలో 25% ఉంటే, తెలంగాణలో 22%గా ఉంది. సేవా రంగం వాటా ఏపీలో 44% అయితే, తెలంగాణలో 61%గా ఉంది.
2023-24 నాటి పరిస్థితుల ప్రకారం ఏపీలో వ్యవసాయ రంగం వాటా 34శాతానికి పెరిగింది. తెలంగాణలో 15%గా ఉంది. ఏపీలో పరిశ్రమల రంగం వాటా 24%కు వచ్చింది. తెలంగాణలో 18%గా ఉంది. అదే కీలకమైన సేవా రంగం వాటా ఏపీలో 42%కి తగ్గగా, తెలంగాణలో 67శాతానికి పెరిగింది. ఆదాయం ఇచ్చే పరిశ్రమలు, సేవారంగం ఏపీలో సరిగా స్థాపితం కాకపోవడంతో రెవెన్యూ రాబడి లేకుండా పోయింది. ఆదాయం సమకూరడం లేదు.

♦️రాజధాని లేకపోవడం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ రాజధానిగా ఉన్నందున ఇన్‌ఫ్రా, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు వంటివి అక్కడే ఉన్నాయి. వాటి ద్వారా తెలంగాణకు కేవలం హైదరాబాద్‌ నుంచే 75% సొంత రెవెన్యూ లభిస్తోంది.
అప్పుల భారం పెరిగి..

రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే వనరులు మృగ్యమయ్యాయి. విభజన తర్వాత అప్పులు ఎక్కువగా రావడంతో అసలు, వడ్డీలు కలిపి చెల్లింపుల భారం పెరిగింది. మరోవైపు జగన్‌ సర్కార్‌లో ఐదేళ్లపాటు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేకపోవడం రాష్ట్రం కోలుకోనంత దెబ్బతిందని ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక సంఘానికి విన్నవించింది.
విభజన తర్వాత రెవెన్యూ లోటు కొంత భర్తీ..

2014-15 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ లెక్కల ప్రకారం ఏపీలో రూ.16,078 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని గుర్తించారు. 

ఇందులో కేంద్రం 2014-15లో రూ2,303 కోట్లు, 2015-16లో రూ.500 కోట్లు, 2016-17లో రూ.1,176.50 కోట్ల చొప్పున ఇచ్చింది. మూడేళ్లలో కలిపి మొత్తం రూ.3,979 కోట్లు సమకూర్చింది.

♦️2023లో అప్పటి రెవెన్యూ లోటు రూ.10,460.87 కోట్ల మొత్తాన్ని వైకాపా సర్కారు సమయంలో తీసుకున్నారు.

ఇదికాక 15వ ఆర్థిక సంఘం ఏపీకి రెవెన్యూ లోటు రూ.22,113 కోట్లుగా లెక్కించింది. 2015-16 నుంచి ఐదేళ్ల కాలంలో ఆ మొత్తం కేంద్రం సమకూర్చింది.
2020-21లో కొవిడ్‌ కారణంగా ఆర్థిక సంఘం తన నివేదిక ఇవ్వలేదు. ఆ ఒక్క ఏడాదికి కేంద్రం రూ.5,897 కోట్లు ఇచ్చింది. 2021-26 మధ్య రూ.30,497 కోట్ల రెవెన్యూ లోటును ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 

వైకాపా ప్రభుత్వం తొలి మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే ఆ మొత్తం తీసేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *