మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో అధికారిక పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్క, తెలంగాణలో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులను తన సోదరులుగా అభివర్ణించిన ఆమె, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరారు.
ప్రభుత్వ లక్ష్యం శాశ్వత పరిష్కారమే!
సమ్మె అనేది సమస్యకు పరిష్కారం కాదని, కేవలం చర్చల ద్వారానే డిమాండ్లు నెరవేరుతాయని సీతక్క స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రధానాంశాలను ప్రస్తావించారు:
కమిటీ నివేదిక: కార్మికుల సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశామని, 4 వారాల్లో నివేదిక రానుందని తెలిపారు.
సాంకేతిక అంశాలు: విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయని.. భవిష్యత్తులో లీగల్ చిక్కులు రాకుండా ఉండటానికే ఈ కమిటీ వేశామని వివరించారు. ఇది కాలయాపన కాదని, ప్రక్రియలో భాగమని ఆమె పేర్కొన్నారు.
బకాయిల చెల్లింపు: గతంలో పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను క్లియర్ చేశామని.. పీఎఫ్, సీసీఎస్ బకాయిలను కూడా గణనీయంగా తగ్గించామని గుర్తు చేశారు.
మహిళలు, పేదల కోసం ఆలోచించండి
రాష్ట్రంలో అమలువుతున్న ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా కోట్లాది మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని, సమ్మె వల్ల వారందరూ ఇబ్బంది పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
“కేసీఆర్ గారు ఉచిత బస్సు దండగ అని హేళన చేసిన 24 గంటల్లోనే కార్మికులు సమ్మెకు వెళ్లడం వల్ల ప్రజలు, ముఖ్యంగా నా ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. ఒక సోదరిగా విజ్ఞప్తి చేస్తున్నా.. వారికి ఆటంకం కలిగించకండి.” అని ఆమె కోరారు.
వార్నింగ్ తో కూడిన విజ్ఞప్తి
గతంలో సమ్మె వల్ల ఎవరికి నష్టం జరిగిందో అందరికీ తెలుసని, పదేళ్ల కాలంలో పేరుకుపోయిన సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావని సీతక్క అన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో సమ్మె వల్ల సంస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొత్త నియామకాల ద్వారా ఉద్యోగ భారం తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సానుకూల వాతావరణంలో చర్చలకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
– E6TV వెబ్ డెస్క్
ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క భావోద్వేగ విజ్ఞప్తి: “సమ్మె విరమించండి.. చర్చలకు రండి”మేఘాలయ (షిల్లాంగ్):

