తమిళ గడ్డపై ‘చంద్ర’ బాబు ఎలక్షన్ వార్.. డీఎంకే, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం!
తళి (కృష్ణగిరి జిల్లా):
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆయన కృష్ణగిరి జిల్లాలోని తళి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
తమిళనాడు నా సొంత గడ్డ లాంటిదే..
సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. “ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాపై చూపిస్తున్న ఆదరణే ఇక్కడ కూడా కనిపిస్తోంది. తమిళనాడుకు వచ్చినా నా సొంత గడ్డపై ఉన్నట్టే ఉంది. చిత్తూరు నుంచే వచ్చిన నాకు తమిళ సంస్కృతి అంటే ఎంతో గౌరవం. భాష ఏదైనా మనమంతా ద్రవిడులమే.. అన్నదమ్ముల్లా కలిసి అభివృద్ధి చెందాలి” అని పేర్కొన్నారు. పురాతన వారసత్వాన్ని కాపాడుకోవడంలో తమిళులు చూపిస్తున్న పట్టుదల గొప్పదని కొనియాడారు.
మహిళా బిల్లుపై డీఎంకే, కాంగ్రెస్‌లపై ధ్వజం
మహిళా రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని మోదీ బిల్లు తెస్తే, కాంగ్రెస్ మరియు డీఎంకే పార్టీలు స్వార్థంతో అడ్డుకున్నాయని మండిపడ్డారు. “మహిళలకు సమాన గౌరవం దక్కడం ఈ పార్టీలకు ఇష్టం లేదా? ఢిల్లీని ఓడించామని విర్రవీగుతున్న డీఎంకే.. మహిళా బిల్లును అడ్డుకుని ఏం సాధించింది?” అని ఆయన ప్రశ్నించారు.
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం
తమిళనాడు తిరిగి పూర్వవైభవం సాధించాలంటే కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉండాలని (డబుల్ ఇంజన్ సర్కార్) చంద్రబాబు స్పష్టం చేశారు.
నదుల అనుసంధానం: గోదావరి నుంచి కావేరీ వరకు నదుల అనుసంధానం జరగాలంటే మోదీ నాయకత్వం అవసరమని, గంగా-కావేరీ కలవడమే తన లక్ష్యమని చెప్పారు.
శాంతి భద్రతలు: ప్రస్తుతం తమిళనాడులో డ్రగ్స్ సంస్కృతి, కస్టోడియల్ మరణాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జనరంజక పాలన: దివంగత నేత జయలలిత స్ఫూర్తితో అభివృద్ధి జరగాలని, మద్యం రేట్లు పెంచి డీఎంకే కేవలం ఖజానా నింపుకుంటోందని విమర్శించారు.
స్థానిక విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నల్
తళి ప్రాంత ప్రజల చిరకాల కోరిక మేరకు, తళి నుంచి తిరుపతికి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక నేతలు కోరగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వెంటనే బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ విజన్ తో కూడిన ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో తమిళనాడు భాగస్వామి కావాలని, ఎన్డీఏకు వేసే ప్రతి ఓటు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని ఆయన పిలుపునిచ్చారు.

