Breaking News

వ్యూహకర్త నుంచి కేబినెట్ మంత్రి వరకు.. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న తెలుగు తేజం ‘ఎస్. కీర్తన’!

E6TV చెన్నై:

తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళ వెట్రి కళగం’ (TVK) మంత్రివర్గంలో ఒక యువ కిరణం మెరిసింది. కేవలం 30 ఏళ్ల వయసులోనే కీలకమైన మంత్రి పదవిని దక్కించుకుని, ఆధునిక రాజకీయాల్లో నైపుణ్యమే అసలైన అర్హత అని చాటిచెప్పారు మన తెలుగు ఆడపడుచు ఎస్. కీర్తన.

వ్యూహకర్తగా ప్రస్థానం:

డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్‌పై ఉన్న అపారమైన పట్టుతో ‘షోటైమ్ కన్సల్టింగ్’ సంస్థలో పొలిటికల్ కన్సల్టెంట్‌గా కీర్తన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయంలో ఆమె వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలోనూ, డేటా విశ్లేషణ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నడిపించడంలో ఆమె తన మేధస్సును నిరూపించుకున్నారు.

విజయ్ పిలుపు – శివకాశి విజయం:

రాజకీయాలకు శాస్త్రీయ దృక్పథం, యువత ఆలోచనలు అవసరమని నమ్మిన ముఖ్యమంత్రి విజయ్, కీర్తనలోని నైపుణ్యాన్ని గుర్తించి ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. శివకాశి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించగా, తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

యువతకు స్ఫూర్తి:

రాజకీయాలంటే కేవలం వారసత్వమో, సుదీర్ఘ అనుభవమో మాత్రమే కాదని.. పక్కా ప్రణాళిక, ప్రజల నాడిని పట్టుకునే నైపుణ్యం ఉంటే యువత అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరని కీర్తన నిరూపించారు. ఒక సాధారణ స్ట్రాటజిస్ట్ స్థాయి నుండి నేడు తమిళనాడు ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న కీర్తనకు E6TV తరపున శుభాకాంక్షలు.

E6TV న్యూస్, Chennai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *