సిర్పూర్ శివారులో ఎకరం భూమిపై వివాదం.. జేసీబీతో నాలుగు గదుల ఇల్లు నేలమట్టం!
2006 జూన్ 26న తాళ్ల పద్మాబాయి నుంచి భూమి కొనుగోలు చేశానంటున్న నారాయణరెడ్డి
20 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నానని బాధితుడి వెల్లడి
2024, 2025లో రెండుసార్లు భూ సర్వే చేయించారని వెల్లడి
30 నుంచి 40 మంది వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ
అక్టోబర్ 31న జేసీబీతో ఇంటి కూల్చివేత.. రూ.10 లక్షల నష్టం
కొందరు రాజకీయ నాయకులు, విలేకరుల ప్రమేయం ఉందంటూ బాధితుడి సంచలన ఆరోపణలు
పోలీసులకు ఫిర్యాదు.. సమగ్ర విచారణతో పాటు న్యాయం చేయాలని విజ్ఞప్తి
నిజామాబాద్, నవంబర్ 1 (E6tv న్యూస్: శివ ఠాకూర్).
ఒక ఎకరం భూమి.. రెండు వర్గాల మధ్య హక్కుల వివాదం.. ప్రభుత్వ భూమి కేటాయింపు అంశం.. రెండుసార్లు సర్వేలు.. బెదిరింపులు.. చివరకు జేసీబీతో ఇల్లు కూల్చివేత! నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబర్ 602/140 పరిధిలో తనకు సంబంధించిన భూమిలో నిర్మించుకున్న నాలుగు గదుల ఇంటిని కొందరు వ్యక్తులు జేసీబీతో కూల్చివేశారని ముదక్పల్లి గ్రామానికి చెందిన తిప్పులూరి నారాయణరెడ్డి (53) ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భూమిని స్వాధీనం చేసుకునేందుకు కొందరు వ్యక్తులు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారని, స్థానిక రాజకీయ నాయకులు, కొందరు విలేకరుల ప్రమేయం కూడా ఉందని ఆయన చేసిన ఆరోపణలు ఈ వివాదానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.
నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 602/140 పరిధిలో ముదక్‌పల్లికి చెందిన తాళ్ల పద్మాబాయి వద్ద నుంచి 2006 జూన్ 26న ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసుకున్నప్పటినుండి ఇప్పటివరకు సుమారు 20 సంవత్సరాలుగా అక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని నారాయణరెడ్డి తెలిపారు. కాలానుగుణంగా కూరగాయలు, వరి పంటలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని వెల్లడించారు. 2008 సంవత్సరంలో అదే భూమిలో నాలుగు గదులతో కూడిన ఇంటిని నిర్మించుకుని నివాసం ఉంటున్నట్లు వివరించారు.
ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు.. అసలు వివాదం ఇక్కడే!
ఇదిలా ఉండగా 2024 సంవత్సరంలో బాలయోగి అవధూత నిర్మలానంద స్వామీజీగా చెప్పుకుంటున్న జట్టు మారాజు అనే వ్యక్తి తెరపైకి వచ్చారని నారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే సర్వే నంబర్ పరిధిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని చెప్పుకుంటున్నాడని,దీంతో ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న తనకు, ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపును ప్రస్తావిస్తున్న మరో వర్గానికి మధ్య వివాదం ప్రారంభమైందని తెలిపారు.అయితే అసలు ఐదు ఎకరాల భూమి కేటాయింపు జరిగిందా? జరిగితే ఏ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించారు? ఆ భూమి హద్దులు ఏమిటి? ప్రస్తుతం వివాదంలో ఉన్న ఒక ఎకరం భూమి ఆ ఐదు ఎకరాల పరిధిలోకి వస్తుందా? అనే అంశాలపై అధికారిక రికార్డుల ఆధారంగా స్పష్టత రావాల్సి ఉంది.
రెండుసార్లు సర్వే.. అయినా ఎందుకు తేలని భూమి హద్దుల వివాదం?
భూమి హక్కుల విషయంలో వివాదం తలెత్తడంతో 2024, 2025 సంవత్సరాల్లో రెవెన్యూ అధికారుల ద్వారా సర్వేయర్‌తో రెండుసార్లు భూమిని సర్వే చేయించినట్లు నారాయణరెడ్డి చెబుతున్నారు. తన పొలం హద్దులను గుర్తించి కంచె నిర్మాణం చేసుకున్నానని, సర్వే నిర్వహించిన నివేదికలు, హద్దుల నిర్ధారణ వివరాలు అధికారుల వద్ద ఉన్నాయని, వాటిని పరిశీలించి వాస్తవాలు వెల్లడించాలని కోరుతున్నారు.ఒకవేళ భూమిపై రెండు వర్గాల మధ్య హక్కుల వివాదం ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులు, న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉండగా.. వ్యక్తులు స్వయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, 30, 40 మందితో వచ్చి దాడికి పాల్పడడం, దుర్భాషలాడడం, భయభ్రాంతులకు గురి చేయడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పొలంలోనే కాల్చి బూడిద చేస్తామని బెదిరింపులు చేశారట!
తన భూమిని వదిలేయాలని ఒత్తిడి చేస్తూ సుమారు 30 నుంచి 40 మంది వ్యక్తులు పొలం వద్దకు వచ్చి తనను ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ బెదిరించారని నారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు. పొలంలోనే కాల్చి బూడిద చేస్తామని హెచ్చరించారని, ఎవరు వచ్చినా వెనక్కి తగ్గేది లేదంటూ భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు.తన పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలను సైతం బెదిరించడంతో పాటు కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. ఈ బెదిరింపులపై కూడా పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అక్టోబర్ 31న జేసీబీతో నాలుగు గదుల ఇల్లు నేలమట్టం!
వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో 2026 అక్టోబర్ 31వ తేదీ ఉదయం సుమారు 10 గంటల సమయంలో జట్టు మారాజు, ఆయన శిష్యుడు మణిక్యం, జేసీబీ డ్రైవర్ తో పాటు, జెసిబి ఓనర్ సుధాకర్ వినకుండా మరికొందరు వ్యక్తులు తన పొలంలో నిర్మించుకున్న ఇంటి వద్దకు వచ్చారని నారాయణరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసులు జారీ చేయకుండా జేసీబీని తీసుకొచ్చి తన ఇంటిని కూల్చివేశారని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నాలుగు గదుల నిర్మాణం పూర్తిగా ధ్వంసమైందని, ఇంటి శిథిలాలు ప్రస్తుతం అక్కడే ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనలో తనకు సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇంటి కూల్చివేతకు సంబంధించి ఏదైనా అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? రెవెన్యూ లేదా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ చర్యలో పాల్గొన్నారా? లేక ప్రైవేటు వ్యక్తులే స్వయంగా కూల్చివేతకు పాల్పడ్డారా? అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది.
మీడియా ముసుగులో భూ వ్యవహారం నడుస్తోందా? బాధితుడి సంచలన ఆరోపణలు!
ఈ వివాదం వెనుక మరో కోణం ఉందంటూ నారాయణరెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన కొందరు విలేకరుల సహకారంతోనే గత రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోందని ఆయన ఆరోపించారు. వివాదాస్పద భూమి తమకు దక్కిన తర్వాత అందులో వాటా ఇస్తామని కొందరు విలేకరులతో ఒప్పందం చేసుకున్నారనే అనుమానం తనకు ఉందని పేర్కొన్నారు.
మీడియా సహకారం ఉందనే ధీమాతోనే స్వామీజీగా చెప్పుకుంటున్న వ్యక్తి, ఆయన అనుచరులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా పేరును అడ్డుపెట్టుకుని భూ వ్యవహారంలో కొందరు వ్యక్తులు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు.. రక్షణ కల్పించాలని వేడుకోలు!
తనకు జరిగిన అన్యాయం, ఇంటి కూల్చివేత, బెదిరింపులపై నారాయణరెడ్డి మోపాల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఇంటిని కూల్చివేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు జరిగిన రూ.10 లక్షల ఆస్తి నష్టానికి తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై తనను, తన కుటుంబ సభ్యులను ఎవరూ బెదిరించకుండా పోలీసు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు.
- 2006 జూన్ 26న జరిగిన భూమి కొనుగోలుకు సంబంధించిన పత్రాల చట్టబద్ధత ఏమిటి?
- సర్వే నంబర్ 602/140లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు జరిగిందా?
- కేటాయింపు జరిగితే సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు, పట్టా వివరాలు ఏమిటి?
- 2024, 2025లో నిర్వహించిన రెండు సర్వేల నివేదికల్లో ఏముంది?
- ఇంటి కూల్చివేతకు సంబంధించి అధికారిక అనుమతులు లేదా ఉత్తర్వులు ఉన్నాయా?
- కూల్చివేత సమయంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు ఉన్నారా?
- బాధితుడు ఆరోపిస్తున్న బెదిరింపులు, కుల దూషణలపై విచారణ జరిగిందా?
- రాజకీయ నాయకులు, విలేకరుల ప్రమేయం ఉందన్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా?
ఈ ప్రశ్నలకు రెవెన్యూ రికార్డులు, సర్వే నివేదికలు, ప్రభుత్వ భూమి కేటాయింపు ఉత్తర్వులు, పోలీసుల విచారణ ద్వారా సమాధానాలు రావాల్సి ఉంది.
బాధితుడికి న్యాయం ఎప్పుడు? అసలు భూమి ఎవరిది?
ఒకవైపు 2006లో భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నానని ఒక వ్యక్తి చెబుతుండగా, మరోవైపు అదే సర్వే నంబర్ పరిధిలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఈ రెండు వాదనల్లో వాస్తవాలను నిర్ధారించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. భూమి హక్కుల వివాదం పేరుతో ఎవరికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం లేదు. ఇంటి కూల్చివేత, బెదిరింపులు, ఆస్తి నష్టం ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని బాధితుడు కోరుతున్నారు.
భూమి ఎవరిది? ఐదు ఎకరాల కేటాయింపు వెనుక వాస్తవాలేమిటి? ఇంటి కూల్చివేతకు అనుమతి ఎవరిచ్చారు? మీడియా ప్రమేయం ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? ఈ ప్రశ్నలన్నింటికీ అధికారుల విచారణే సమాధానం చెప్పాల్సి ఉంది.





