Breaking News

హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణలో లోపాలపై అధికారులపై ఆగ్రహం

కరీంనగర్, అక్టోబర్ 31 (E6tv న్యూస్).

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిని అడిషనల్ కలెక్టర్ అశ్విని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఓపిడి, గైనకాలజీ, అత్యవసర చికిత్స విభాగం, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గదులను సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారు.తనిఖీల్లో మందుల నిల్వలు, వాటి వినియోగానికి సంబంధించిన రికార్డుల నిర్వహణలో తీవ్ర లోపాలను గుర్తించారు. ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత మందులు ఆస్పత్రికి చేరకముందే రికార్డుల్లో నమోదు చేయడంపై అడిషనల్ కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

అనంతరం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేలా వైద్య సిబ్బంది పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో అసిస్టెంట్ కలెక్టర్ హరిప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, ఆర్డీవో జలకుమారి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *