హిందూ సామాజిక వర్గం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులకు వెనుకబడిన తరగతుల (BC) రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. మతమార్పిడికి ముందు ఉన్న సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకుని, వేరే మతంలోకి మారిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద రిజర్వేషన్ ఫలాలు లేదా ప్రత్యేక వెసులుబాట్లు కోరలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తమిళనాడు ప్రభుత్వం మార్చి 9, 2024న ఇచ్చిన ఉత్తర్వుల (G.O.) ప్రకారం.. హిందూ సామాజిక వర్గం (BC, MBC, SC) నుంచి ఇస్లాంలోకి మారిన వారికి బిసి (ముస్లిం) హోదా కింద రిజర్వేషన్లు పొందే అవకాశం కల్పించింది. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ మద్రాస్ హైకోర్టు గతంలో ఆ జీవోను రద్దు చేసింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తీర్పే సరైనదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
