మేయర్ ఎన్నికల్లో 35.29 శాతం రిజర్వేషన్లు – మంత్రి అచ్చెన్నాయుడు
పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడి
అమరావతి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీలకు కల్పించనున్న రిజర్వేషన్ల శాతాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మేయర్ ఎన్నికల్లో బీసీలకు 35.29 శాతం, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో 33.02 శాతం, పట్టణ వార్డుల్లో 32.78 శాతం సీట్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీ వార్డుల్లో 26.73 శాతం, సర్పంచ్ ఎన్నికల్లో 27.95 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు.ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 24.6 శాతం, జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో 23.08 శాతం సీట్లు కేటాయిస్తామని వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఈ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై మంత్రి చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన తుది ఉత్తర్వులు, అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాత పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
