మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా
నిర్మల్ జిల్లా, నవంబర్ 21 (E6tv NEWS).
నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర నాకాబందీ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు, ఇతర కీలక ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ తదితర ధ్రువపత్రాలను పరిశీలించారు.ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని బ్రీత్ అనలైజర్ ద్వారా తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసిన వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, అధిక వేగం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించారు.అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వాహనదారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాల వినియోగం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని, ఇలాంటి ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.



