ఏడు గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన
పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆందోళన
కమ్మర్‌పల్లి, అక్టోబర్ 14 (E6 TV NEWS).
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రోజుకు కేవలం ఏడు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని, అది కూడా నిర్దేశిత సమయానికి సక్రమంగా సరఫరా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి విద్యుత్ ఎంతో కీలకమైన సమయంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు నీరందించలేకపోతున్నామని రైతులు వాపోయారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు.
సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్
విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి వ్యవసాయానికి నిరంతరాయంగా నిర్ణీత సమయం మేరకు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని నర్సాపూర్ గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు.
