బల్దియా సమస్యలు పరిష్కరించాలి.. బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా
నిజామాబాద్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: శివ ఠాకూర్).
ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ వి. ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో జరిగిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఇందూర్ కార్పొరేషన్లో ప్రతి బడ్జెట్ సమావేశంలో కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ, అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. కార్పొరేషన్‌కు రూ.150 కోట్ల ఆదాయం, రూ.94 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టకపోవడం బాధాకరమన్నారు.గతంలో పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనలో కూడా నగర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. నిజామాబాద్ అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించినప్పటికీ నిధులు విడుదల కాలేదని ఆరోపించారు.ప్రజలకు కాగితాలపై నిధుల వివరాలు అవసరం లేదని, వాటితో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని ధన్పాల్ అన్నారు. డివిజన్ల అభివృద్ధికి బడ్జెట్లో రూ.35 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు.
మురుగు కాలువలు, వీధి కుక్కల సమస్యలపై ఆగ్రహం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వీధి కుక్కల సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.విలీన గ్రామాల పరిధిలోని డివిజన్లలో ప్రజా సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బల్దియా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నగర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని, రూ.100 కోట్లు అయినా, రూ.1,000 కోట్లు అయినా ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ఎంపీ, ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని దినేష్ పటేల్ కులాచారి తెలిపారు.
కార్పొరేషన్ ముట్టడితో ఉద్రిక్తత
ధర్నా అనంతరం బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కమిషనర్ వచ్చే వరకు కదిలేది లేదంటూ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, బీజేపీ కార్పొరేటర్లు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.అనంతరం కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో 28 మంది బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
