జాతీయ స్థాయిలో తెలంగాణ యువ మహిళా నాయకురాలికి గుర్తింపు
పార్టీ అభివృద్ధికి పూర్తి సమయం కేటాయిస్తా: కసిరెడ్డి సింధూరెడ్డి
చందానగర్, అక్టోబర్ 21 (E6 tv NEWS).
భారతీయ జనతా పార్టీ యువమోర్చా (బిజెవైఎం) జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా చందానగర్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బిజెవైఎం తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు కసిరెడ్డి సింధూరెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హెమాంగ్ జోషి మంగళవారం ప్రకటించారు. తెలంగాణకు చెందిన యువ మహిళా నాయకురాలికి జాతీయ స్థాయిలో అవకాశం కల్పించడంపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.
పార్టీ అభివృద్ధికి పూర్తి సమయం కేటాయిస్తా…
ఈ సందర్భంగా కసిరెడ్డి సింధూరెడ్డి మాట్లాడుతూ, పార్టీ తనపై నమ్మకంతో కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించిందని, ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు. అనంతరం బిజెవైఎం తెలంగాణ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించిందని తెలిపారు. యువమోర్చా ఇచ్చిన ప్రతి పిలుపును తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశానని చెప్పారు.తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించిన నేపథ్యంలో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. బిజెవైఎం చేపట్టే కార్యక్రమాలు, ఇచ్చే పిలుపులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన శక్తిమేరకు పనిచేస్తానని, పార్టీకి, దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ హెమాంగ్ జోషి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావులకు కసిరెడ్డి సింధూరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బిజెవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎం. రవికుమార్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తానని కసిరెడ్డి సింధూరెడ్డి తెలిపారు.
