అమరావతి (e6tv news): వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరిశీలకుడిగా (అబ్జర్వర్) ఆయన్ను నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన చిన్న శ్రీనుకు నెల రోజుల్లోనే ఇంతటి ముఖ్యమైన బాధ్యతను అప్పగించడం ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాడర్‌ను బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిన్న శ్రీను స్పందిస్తూ.. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే తాను పార్టీలో చేరానని, స్థానిక నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అరకు ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
