Breaking News

మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది

గోదావరి జలాలను ఎత్తిపోసి ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ను నింపాలి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

మేడిగడ్డ, అక్టోబర్ 3 (E6tv న్యూస్).

మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయని, కేవలం రెండు మూడు పిల్లర్లకు మరమ్మతులు అవసరమైతే వాటిని కూడా చేపట్టకుండా ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత–గోదావరి సంగమ ప్రాంతం, కన్నెపల్లి పంప్‌హౌస్‌తో పాటు మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం సుమారు 22 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, రోజుకు దాదాపు రెండు టీఎంసీల నీరు వృథాగా దిగువకు వెళ్తోందని తెలిపారు.కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలను ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌తో పాటు మిడ్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లను నింపవచ్చని పేర్కొన్నారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీని నింపవచ్చని, రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర పాటు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను నింపే అవకాశం ఉందని వివరించారు.

గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంతరెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి లిఫ్టుల పరిధితో పాటు నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగునీరు అందక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు. తెలంగాణలో పక్కనే ఉన్న ప్రాజెక్టులకు నీటిని తరలించకుండా సముద్రం పాలు చేస్తున్నారని, మరోవైపు చంద్రబాబు నాయుడు కుప్పం వరకు నీటిని తరలించుకుపోతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ఆలోచించి కన్నెపల్లి పంపులను ప్రారంభించి వృథాగా పోతున్న గోదావరి జలాలను తెలంగాణ ప్రాజెక్టులకు తరలించాలని డిమాండ్ చేశారు. సాగునీరు విడుదల చేయకపోతే తెలంగాణ రైతాంగం ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున రైతు పోరుబాట ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, విఠల్ రావు, షేక్ ముజీబుద్దీన్ తదితర బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *