కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం
ఎడపల్లి, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి)
బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం కింద వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫారసుల మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వాలని కోరారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌పాడ్ గ్రామంలో బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో బి. మల్లేష్ మాట్లాడారు. బీడీ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీడీ కార్మికులపై గతంలో విధించిన ఆంక్షలను తొలగించి, అర్హులైన ప్రతి బీడీ కార్మికుడికి ఆసరా పథకం కింద నెలకు రూ.4 వేల పెన్షన్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మల్లేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.2 వేల పెన్షన్ పొందుతున్న వారికి కూడా రూ.4 వేలకు పెంచుతామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు హామీ అమలు కాలేదని అన్నారు.
ఆంక్షల కారణంగా పెన్షన్ పొందలేకపోతున్న బీడీ కార్మికులను కూడా గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే రూ.4 వేల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు ప్రస్తుతం అందుతున్న పెన్షన్ చాలా తక్కువగా ఉందని, కొంతమందికి రూ.1,000 కంటే తక్కువే లభిస్తోందని మల్లేష్ అన్నారు. ఈపీఎఫ్ పెన్షన్‌ను రూ.3 వేలు, రూ.5 వేలు, రూ.7,500కు పెంచుతామని గతంలో ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పటికీ పెన్షన్ పెంపు జరగలేదని పేర్కొన్నారు.
ఈపీఎఫ్‌కు సంబంధించిన నిబంధనల వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఉద్యోగం నుంచి వైదొలిగిన తర్వాత పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే విషయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. పీఎఫ్ రికార్డుల్లో పేరు, వయస్సు తదితర వివరాల్లో చిన్నపాటి తప్పులు ఉన్నా వాటి సవరణ కోసం కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సీబీటీ సిఫారసుల మేరకు ఈపీఎఫ్ పెన్షన్‌ను నెలకు రూ.9 వేల వరకు పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని బి. మల్లేష్ డిమాండ్ చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్మిక సమస్యలపై కార్మిక లోకం అప్రమత్తంగా ఉందని, భవిష్యత్‌లో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తామని బి. మల్లేష్ తెలిపారు.


