Breaking News

పొతంగల్ సొసైటీ డైరెక్టర్ల ఎంపికపై రాజకీయ వేడి!

పాత, కొత్త కాంగ్రెస్ క్యాడర్ల మధ్య విభేదాలు?

ముగ్గురు డైరెక్టర్ల నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠ

పోతంగల్, అక్టోబర్ 24 (E6tv న్యూస్).

నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని సొసైటీ నూతన పాలకవర్గం ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. సొసైటీ చైర్మన్‌గా మాజీ జెడ్పీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హెగ్డోలి శంకర్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు ముగ్గురు డైరెక్టర్ల నియామకంపై రాజకీయ వేడి రాజుకుంటున్నట్లు స్థానికంగా చర్చలు వినిపిస్తున్నాయి.సుమారు 20 గ్రామాలకు సేవలందించే ఈ సొసైటీలో పాత పొతంగల్ గ్రామానికి చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఎంపికపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కోసం చాలాకాలంగా పనిచేస్తున్న పాత కార్యకర్తలకు అవకాశం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తుండగా, కొత్తగా పార్టీలో చురుకుగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పాత క్యాడర్‌కు ప్రాధాన్యత దక్కేనా?

సొసైటీ డైరెక్టర్ల ఎంపికలో పాత కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తే తమకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం కొందరు పాత కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని పలువురు కోరుతున్నట్లు సమాచారం.మరోవైపు, ఓ సీనియర్ నాయకుడు తనకు అనుకూలమైన వ్యక్తులకు డైరెక్టర్ పదవులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ముగ్గురు డైరెక్టర్ల ఎంపికలో ఎవరి అభిప్రాయానికి ప్రాధాన్యత లభిస్తుంది? పాత కార్యకర్తల డిమాండ్ నెరవేరుతుందా? లేక కొత్తవారికి అవకాశం దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

రైతుల అభిప్రాయమే కీలకం: హెగ్డోలి శంకర్

ఈ వ్యవహారంపై మాజీ జెడ్పీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హెగ్డోలి శంకర్‌ను ఫోన్‌లో వివరణ కోరగా, సొసైటీ సభ్యులు, రైతుల అభిప్రాయాల మేరకే ముగ్గురు డైరెక్టర్ల నియామకం జరుగుతుందని తెలిపారు. ఈ ఎంపికలో ఎలాంటి రాజకీయాలకు తావుండదని పేర్కొన్నారు.పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, కొత్తవారికి డైరెక్టర్ పదవులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో సొసైటీ సభ్యులు, రైతుల అభిప్రాయాలకే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో ఈ సమస్యను అధిగమించి, సొసైటీ అభివృద్ధితో పాటు రైతుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.

మొత్తానికి పొతంగల్ సొసైటీ నూతన పాలకవర్గంలో ముగ్గురు డైరెక్టర్ల ఎంపిక ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పాత, కొత్త కార్యకర్తల మధ్య నెలకొన్నట్లు చెబుతున్న అసంతృప్తికి ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? డైరెక్టర్ల ఎంపికలో ఎవరికి అవకాశం దక్కుతుంది? అన్నది తేలాల్సి ఉంది.

— E6 TV NEWS, పొతంగల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *