Breaking News

రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ అరెస్ట్… పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య వరుసగా రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఒక కారు ధ్వంసం కాగా, వైఎస్సార్‌సీపీ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లను రప్పించి గొడవలను తీవ్రతరం చేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు పంజాబ్ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక రివాల్వర్, ఒక పిస్టల్ మరియు 30 సజీవ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి సెక్యూరిటీగా వచ్చామని వారు చెబుతున్నప్పటికీ, ఈ గ్యాంగ్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ పరిణామంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రక్షణ పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలు రౌడీషీటర్లను, గ్యాంగ్‌స్టర్లను తెప్పించి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాయచోటి వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేసి పోలీసుల పహారా పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ.. ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్ ప్రాంతాల నుంచి మూకలను రప్పించారని ఆరోపించారు. ఈ కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *