Breaking News

నీళ్లు లేక ఎండుతున్న వరి పంట.. ట్యాంకర్లతో తడుపుతున్న రైతు

చివరి దశలో నీటి కొరతతో అన్నదాత ఆందోళన

రెండు ఎకరాల సాగుకు రూ.50 వేల పెట్టుబడి.. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా

నాగిరెడ్డిపేట, అక్టోబర్ 14 (E6 TV NEWS).

పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత రైతును ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంట చివరి దశకు చేరుకున్న వేళ సాగునీరు అందక పొలం ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఓ రైతు పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండాకు చెందిన కొర్ర తవుర్య రెండు ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే పంట కీలక దశలో నీరు అందకపోవడంతో పంట ఎండిపోకుండా ఉండేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పొలానికి సరఫరా చేస్తున్నారు.

రూ.50 వేల పెట్టుబడి.. దిగుబడిపై ఆందోళన

రెండు ఎకరాల్లో వరి సాగు చేసేందుకు ఇప్పటికే సుమారు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపారు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత ఏర్పడటంతో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని తెప్పించాల్సి రావడంతో అదనపు ఖర్చు భారంగా మారిందని వాపోతున్నారు. సకాలంలో నీరు అందకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

అధికారులు స్పందించి పంటను కాపాడాలి

పంట చివరి దశలో ఉన్న సమయంలో నీటి కొరత ఏర్పడటంతో రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలని రైతు కోరుతున్నారు. పంటకు అవసరమైన నీరు అందించేలా చర్యలు తీసుకుని, సాగు చేసిన పంటను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట నీరు లేక ఎండిపోతుండటంతో రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *