Breaking News

పటాన్‌చెరులో అండర్‌-17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, అక్టోబర్ 15 (E6tv ప్రతినిధి).

పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్‌-17 బాలబాలికల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి 200 మందికి పైగా బాలబాలికల క్రీడాకారులు ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తున్నాయి.

విద్యార్థుల జీవితంలో క్రీడలు కీలకం

విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైన భాగం కావాలని నిర్వాహకులు పేర్కొన్నారు. పటాన్‌చెరును రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో కూడా ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పూర్వ రెజ్లర్లు, స్థానిక ప్రముఖులు, క్రీడా నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ మాద్రి పృథ్వీరాజ్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *