పాలస్తీనా ప్రజల పోరాటానికి ప్రపంచ ప్రజలు మద్దతు ఇవ్వాలి: రంగారెడ్డి
భగత్ సింగ్ 119వ జయంతి సదస్సులో వక్తలు
కొత్తగూడెం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి).
భగత్ సింగ్ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలను ఆదర్శంగా తీసుకుని ప్రజలు ముందుకు సాగాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు రంగారెడ్డి పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ కార్యాలయంలో కామ్రేడ్ కిచ్చర్ల కల్పన అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.అమెరికా సామ్రాజ్యవాదం పలు స్వతంత్ర దేశాలపై ఒత్తిడి, ఆంక్షలు, దాడులకు పాల్పడుతోందని రంగారెడ్డి ఆరోపించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూ పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న యుద్ధం, హింసకు అమెరికా ప్రభుత్వం బాధ్యత వహిస్తోందని ఆయన విమర్శించారు. పాలస్తీనా ప్రజల స్వాతంత్ర్య ఆకాంక్షకు ప్రపంచ ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.
అంతర్జాతీయ సంస్థలు గుర్తించిన దేశాల ఉనికిని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం సరికాదని రంగారెడ్డి అన్నారు. పాలస్తీనా ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారని, వారి హక్కులకు మద్దతుగా ప్రజలు నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సదస్సులో PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు దాసరి సాయన్న, రైతు సంఘం డివిజన్ నాయకులు సున్నం వీరభద్రం తదితరులు పాల్గొని మాట్లాడారు.

