Breaking News

మీరు తింటున్న బిల్లులో ‘జీఎస్టీ’ పన్ను కాదా, మోసమా?

హైదరాబాద్: కుటుంబంతో లేదా స్నేహితులతో రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు భోజనం బిల్లులో ఆహారం ధరతో పాటు CGST, SGST పేరిట పన్ను వసూలు చేయడం సాధారణం. అయితే, ప్రతీ రెస్టారెంట్‌కూ కస్టమర్ల నుంచి జీఎస్టీ వసూలు చేసే హక్కు ఉందా అంటే లేదనే చెప్పాలి. కేవలం 30 సెకన్ల చిన్నపాటి తనిఖీతో మీరు చెల్లిస్తున్న జీఎస్టీ సరైనదేనా కాదా అని మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. దీనిపై చార్టర్డ్ అకౌంటెంట్ ప్రతీక్ భర్దా సోషల్ మీడియాలో పంచుకున్న సమాచారం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

‘రెగ్యులర్’ vs ‘కంపోజిషన్’ స్కీమ్ తేడా ఏమిటి?

జీఎస్టీ విధానంలో వ్యాపారులు ప్రధానంగా రెండు కేటగిరీలుగా నమోదు అవుతారు:

  1. రెగ్యులర్ స్కీమ్ (Regular Scheme): ఈ విభాగంలో ఉన్న రెస్టారెంట్లు మాత్రమే కస్టమర్ల నుంచి చట్టబద్ధంగా జీఎస్టీ (CGST + SGST) వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయాలి.
  2. కంపోజిషన్ స్కీమ్ (Composition Scheme): చిన్న వ్యాపారులు, రెస్టారెంట్ల కోసం తీసుకొచ్చిన సులభతర పన్ను పథకం ఇది. ఈ స్కీమ్‌లో ఉన్నవారు తమ టర్నోవర్‌పై నామమాత్రపు పన్నును స్వయంగా ప్రభుత్వానికి చెల్లిస్తారు. వీరు కస్టమర్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ జీఎస్టీ వసూలు చేయకూడదు. ఒకవేళ బిల్లులో జీఎస్టీ కలిపితే అది చట్టవిరుద్ధం మరియు మోసం కిందకే వస్తుంది.

30 సెకన్లలో మీ ఫోన్‌లో ఎలా చెక్ చేయాలి?

మీకు ఇచ్చిన బిల్లుపై జీఎస్టీ సరిగ్గా వసూలు చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఈ సులభమైన మార్గదర్శిని పాటించండి:

  1. GSTIN నంబర్ చూడండి: బిల్లుపై ప్రింట్ అయిన 15 అంకెల జీఎస్టీ నంబర్‌ను (GSTIN) గమనించండి.
  2. పోర్టల్ ఓపెన్ చేయండి: మీ ఫోన్ బ్రౌజర్‌లో gst.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  3. సెర్చ్ టాక్స్ పేయర్: హోమ్‌పేజీలోని ‘Search Taxpayer’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  4. వివరాలు నమోదు చేయండి: బిల్లుపై ఉన్న 15 అంకెల GSTIN నంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
  5. పరిశీలించండి: వివరాల్లో ‘Taxpayer Type’ వద్ద ‘Regular’ అని ఉంటే జీఎస్టీ వసూలు చేయడం సరైనదే. ఒకవేళ ‘Composition’ అని ఉండి కూడా మీ దగ్గర జీఎస్టీ వసూలు చేస్తే, అది నిబంధనల ఉల్లంఘనే.

గమనిక: కంపోజిషన్ స్కీమ్‌లో ఉన్న రెస్టారెంట్ అక్రమంగా జీఎస్టీ వసూలు చేస్తే నిలదీయవచ్చు లేదా జీఎస్టీ అధికారులకు, వినియోగదారుల ఫోరమ్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *