రావులచెరువులో 42 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు

104 ఆరోగ్య రథం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు

పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ

ధర్మవరం రూరల్‌, అక్టోబర్ 9 (E6 TV NEWS): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ ద్వారా 42 రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్‌ మండలం రావులచెరువు గ్రామంలో భవ్య హెల్త్‌ సర్వీస్‌ ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

గతంలో 104 ఆరోగ్య రథం ద్వారా రక్తపోటు, మధుమేహం, మూత్ర పరీక్షలు మాత్రమే నిర్వహించేవారని ల్యాబ్‌ టెక్నీషియన్‌ గంగాభవాని తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చొరవతో వైద్య పరీక్షల పరిధిని విస్తరించి, ప్రస్తుతం రెండు ఆధునిక యంత్రాల సహాయంతో 42 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఆధునిక యంత్రాలతో వైద్య పరీక్షలు

గ్రామీణ ప్రజలు వైద్య పరీక్షల కోసం దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్య రథం ద్వారా అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తూ, ప్రజలకు వైద్య సేవలను చేరువ చేస్తున్నారు.

ఉచితంగా మందుల పంపిణీ

ఆరోగ్య పరీక్షల అనంతరం అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నారు. పరీక్షల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వారికి సంజీవిని ఆసుపత్రి ద్వారా చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సిబ్బంది తెలిపారు. తద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్స పొందేందుకు అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు.

వాట్సాప్‌ ద్వారా పరీక్షల నివేదికలు

ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వారికి సంబంధించిన నివేదికలను వాట్సాప్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లకు పంపిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేని వారికి నివేదికలను ముద్రించి అందజేస్తున్నారు. పరీక్షల నిర్వహణ నుంచి నివేదికల పంపిణీ వరకు ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్నట్లు గంగాభవాని వివరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్‌ దిలీప్‌కుమార్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గంగాభవాని, డీఈవో సాయి విజయ, ఏఎన్‌ఎం శివలక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పీ పరిమళ, ఆశా కార్యకర్తలు సావిత్రమ్మ, సరస్వతి, నాగేంద్రమ్మ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *